ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు అర్జంట్ మెయిల్

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. ప్రభుత్వ తీరును మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుబట్టారు. ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబునాయుడు లేఖ రాశారు.. మెయిల్ పంపారు. ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం, అర్హతలను మారుస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ రూపంలో సవరణలు తేవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు చంద్రబాబు.


కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను గవర్నర్‌ నియమించారని.. రాజ్యాంగంలో ని 243(కె) అధికరణం, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టంలోని 20వ సెక్షన్‌లో నిర్దేశించిన ప్రకారం గవర్నర్‌ 2016లో ఆయన్ను నియమించారని.. ఆయన పదవీకాలం ఐదేళ్లు ఉంటుందని గుర్తు చేశాకె. ఒకసారి నియమితమైన తర్వాత ఆయన పదవీకాలం పూర్తి కాకుండానే అర్హతలు మార్చ డం.. పదవీకాలం తగ్గించడం చట్ట విరుద్ధమన్నారు. కమిషనర్‌ ఆ పదవిలో కొనసాగుతుండగానే ఈ సవరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేయాలని చూడడం అనైతికమని.. ఈ కమిషనర్‌ పదవీకాలం పూర్తయ్యాక కొత్త నిబంధణల్ని అమల్లోకి తీసుకురావొచ్చన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడినా, ప్రక్రియ కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో ఎలా తప్పిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కమిషనర్ తొలగింపునకు ఇది సరైన సమయం కాదని.. 2016లో రాజ్యాంగబద్ధంగా నియమితులైన రమేష్ కుమార్ పదవీకాలం ఐదేళ్లు ముగిసే వరకు ఆయన్నే కొనసాగించాలని, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను, చట్టాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు.